General

రూ.927 కోట్ల హోమ్‌బయ్యర్ల మోసం!

రూ.927 కోట్ల హోమ్‌బయ్యర్ల మోసం!

-      ఓజోన్ అర్బానా సీఎండీ ఎస్. వాసుదేవన్‌ను అరెస్టు చేసిన ఈడీ

గృహ కొనుగోలుదారులను మోసం చేశారన్న ఆరోపణలపై ఓజోన్ అర్బానా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సీఎండీ, ప్రమోటర్‌ ఎస్. వాసుదేవన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది. దాదాపు రూ.927.22 కోట్ల మేర హోమ్‌బయ్యర్ల మోసం, మనీలాండరింగ్‌ కేసులో సెప్టెంబర్‌ 30న మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్‌ 19 కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వాసుదేవన్‌ను అక్టోబర్‌ 1న బెంగళూరులోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఎదుట హాజరుపరచగా.. తదుపరి దర్యాప్తు కోసం 14 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది.

ఓజోన్‌ అర్బానా సంస్థ ఫ్లాట్‌ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఫ్లాట్‌ అప్పగించే వరకు ప్రీ-కన్‌స్ట్రక్షన్‌ ఈఎంఐలను సంస్థే చెల్లిస్తుందని హామీ ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. అయితే ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతోపాటు, కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగించలేదని ఆరోపించింది. అంతేకాకుండా కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాలను కూడా తిరిగి ఇవ్వలేదని, ముందస్తు బుకింగ్‌ మొత్తాలు, రుణాల ద్వారా వచ్చిన నిధులను దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. ఈ కేసులో భాగంగా ఈడీ గత ఏడాది ఆగస్టు 1న బెంగళూరులోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రాజెక్టుల నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి సంబంధించిన పత్రాలు లభించినట్లు వెల్లడించింది.

దర్యాప్తులో భాగంగా గత ఏడాది అక్టోబర్‌ 4న రూ.423.378 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేస్తూ ఈడీ ప్రొవిజనల్‌ అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ జారీ చేసింది. ఓజోన్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓజోన్‌ రియల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓజోన్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన మూడు కేసుల ఆధారంగా కూడా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ మూడు సంస్థల్లో వాసుదేవన్‌ కామన్‌ డైరెక్టర్‌గా ఉన్నట్లు ఈడీ తెలిపింది. బెంగళూరులోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఓజోన్‌ అర్బానా సంస్థ, దాని ప్రమోటర్లపై ఐపీసీలోని 419, 420, 120బీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కూడా సంస్థ, ప్రమోటర్‌పై కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది.