General

మోదీ బిల్డర్స్ ఎండీ సౌర‌భ్ స‌తీష్ పై  రూ.20.05 లక్షల జరిమానా!

మోదీ బిల్డర్స్ ఎండీ సౌర‌భ్ స‌తీష్ పై  రూ.20.05 లక్షల జరిమానా!
  • విల్లాల పేరుతో కొనుగోలుదారులకు మోసం? 
  • అనుమతులు ప్లాటెడ్ లేఅవుట్‌కే.. 
  • ప్రచారం మాత్రం లగ్జరీ విల్లా ప్రాజెక్టుగా!
  • మోదీ ఎండీ సౌర‌భ్ స‌తీష్ మోదీపై జ‌రిమానా

ఆర్ఈజీ న్యూస్‌, హైద‌రాబాద్‌: 

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విల్లా ప్రాజెక్టు పేరుతో కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) మోదీ బిల్డర్స్ పై జరిమానా విధించింది. రాంపల్లి దాయరాలోని గోల్డెన్ కౌంటీ ప్రాజెక్టుకు సంబంధించి మోదీ బిల్డర్స్, దాని అనుబంధ సంస్థలకు మొత్తం రూ.20.05 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. 

2026 నవంబర్ 10న వెలువడిన ఉత్తర్వుల్లో మోదీ షెల్టర్స్, మోదీ బిల్డర్స్ తో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ సతీష్ మోదీని బాధ్యులుగా పేర్కొంది. రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం-2016లోని సెక్షన్లు 3, 4ను ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. 30 రోజుల్లోపు ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టులో విల్లాలు కొనుగోలు చేసినవారు, గోల్డెన్ కౌంటీ ఫేజ్-1 ఓనర్స్ అసోసియేషన్ కలిసి టీజీ రెరాకు ఫిర్యాదు చేశారు.

లగ్జరీ విల్లాలంటూ ప్రచారం.. సౌకర్యాలు మాత్రం అసంపూర్తి!

గోల్డెన్ కౌంటీని గేటెడ్ లగ్జరీ విల్లా కమ్యూనిటీగా ప్రచారం చేశారని కొనుగోలుదారులు ఆరోపించారు. క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, క్రీడా సదుపాయాలు, అందమైన పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు. అయితే, హామీ ఇచ్చిన సౌకర్యాల్లో చాలా వరకు ఇంకా పూర్తి కాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాగునీరు, మురుగునీటి సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు, భద్రతాపరమైన లోపాలు, నిర్మాణ నాణ్యతలో సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. డబ్బులు చెల్లించినప్పటికీ వాగ్దానం చేసిన సదుపాయాల్ని పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందని కొనుగోలుదారులు ప్రశ్నించారు.

అయితే, ఈ ఆరోపణలను బిల్డర్‌ ఖండించారు. గోల్డెన్ కౌంటీ అనుమతి పొందిన ప్లాటెడ్ డెవలప్‌మెంట్ మాత్రమేనని, కొనుగోలుదారులు భూమి కొనుగోలు, నిర్మాణం కోసం వేర్వేరు ఒప్పందాలు చేసుకున్నారని వివరణ ఇచ్చారు. అనుమతులకు అనుగుణంగానే మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అయితే హెచ్ఎండీఏ అనుమ‌తి, టీజీ రెరా రిజిస్ట్రేష‌న్ కేవ‌లం ప్లాటెడ్ లేఅవుట్‌కు మాత్ర‌మే ఉన్నాయ‌ని టీజీ రెరా గుర్తించింది. కానీ, బిల్డర్లు తమ బ్రోచర్లలో 'గోల్డెన్ కౌంటీ లగ్జరీ విల్లాస్' పేరుతో ప్రచారం చేశార‌ని గ‌మ‌నించింది. అంతేకాకుండా, బ్రోచర్లలో విల్లాలు, క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇతర ఉమ్మడి సౌకర్యాలను చూపించారు. కొనుగోలుదారులతో వేర్వేరు ఒప్పందాలు చేసుకున్నామని బిల్డర్లు చెప్పినప్పటికీ, అంతకుముందే చేసిన ప్రకటనలు, ప్రచారానికి అవి సమాధానం కాదని టీజీ రెరా స్పష్టం చేసింది. అవసరమైన రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టును విల్లా డెవలప్‌మెంట్‌గా ప్రచారం చేయడం చట్టంలోని సెక్షన్లు 3, 4 ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చింది.

90 రోజుల్లో అన్ని సౌకర్యాలు పూర్తి చేయాలి!

టీజీ రెరా తన ఉత్తర్వుల్లో బిల్డర్‌కు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

  • హామీ ఇచ్చిన అన్ని సౌకర్యాలను 90 రోజుల్లో పూర్తి చేయాలి.
  • క్లబ్‌హౌస్, ఉమ్మడి ప్రాంతాలను 30 రోజుల్లో ఓనర్స్ అసోసియేషన్‌కు అప్పగించాలి.
  • ఫేజ్-1 విల్లాలకు నిర్ణీత గడువులో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (OC) పొందాలి.
  • అప్పగించే వరకు ఉమ్మడి ప్రాంతాలు, అవసరమైన సేవల నిర్వహణ బాధ్యత బిల్డర్లదే.
  • మెయింటెనెన్స్ ఛార్జీలకు సంబంధించి పారదర్శకమైన లెక్కలు అందించాలి.

ఇల్లు కొనేవారికి ఈ కేసు ఇచ్చే హెచ్చరిక!

ఈ తీర్పు హైదరాబాద్‌లో విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి కీలక హెచ్చరికగా నిలిచింది. బిల్డర్లు ఇచ్చే బ్రోచర్లు, ప్రకటనలు చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవద్దని ఈ పరిణామం సూచిస్తోంది. ఒక ప్రాజెక్టుకు ఉన్న హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఏ రకమైన అభివృద్ధికి వర్తిస్తున్నాయో పరిశీలించాలి. హామీ ఇచ్చిన సదుపాయాలు నిజంగా ఉన్నాయా లేదా అనేది తనిఖీ చేయాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే, క్లబ్‌హౌస్, పార్కులు, ఇతర ఉమ్మడి ప్రాంతాలను ఓనర్స్ అసోసియేషన్‌కు అధికారికంగా అప్పగించిన తర్వాతే ప్రాజెక్టు పూర్తయినట్లు భావించాలి.