General

ఎల్బీనగర్‌- హయత్‌నగర్‌ మధ్య డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌

ఎల్బీనగర్‌- హయత్‌నగర్‌ మధ్య డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌

హైదరాబాద్‌ లో మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలోని అత్యంత ట్రాఫిక్‌ రద్దీ ప్రాంతమైన ఎల్బీనగర్‌ నుంచి హయత్‌ నగర్‌ మధ్య డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనున్నట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన విజయవాడ జాతీయ రహదారి మార్గంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంతో పాటు నగరంలో 70 కాలనీల్లో నివసిస్తున్న 12 లక్షల మంది ప్రజలకు కష్టాలు తొలగిపోతాయి. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు సుమారు 5.50 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇందుకు రూ.941 కోట్లు ఖర్చు చేయనుండగా కేంద్ర ప్రభుత్వం రూ.741 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.200 కోట్ల భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రతిపాదనలు ఈనెల 17న పంపగా కేంద్రం ఆమోదించింది. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కు ఆర్నెల్లలో టెండర్లు నిర్వహించి పనులు చేపట్టే అవకాశం ఉంది.