- రూ.కోటి లోపు ఫ్లాట్ల అమ్మకాల్లో తగ్గుదల
- ఈ ఏడాది ప్రథమార్ధంలో 32 శాతం డౌన్
- ప్రీమియం ఇళ్లకు పెరిగిన డిమాండ్
- జేఎల్ఎల్ ఇండియా నివేదికలో వెల్లడి
ఇళ్ల కొనుగోలులో భారతీయుల ట్రెండ్ మారింది. ఏదో ఒక సొంతిల్లు ఉంటే చాలు అనుకునే దగ్గర నుంచి విలాసవంతమైన ఇంటిని మాత్రమే కొనాలనుకునే పరిస్థితికి చేరింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో రూ.కోటిలోపు ధర కలిగిన అపార్ట్ మెంట్ల అమ్మకాలు 32 శాతం తగ్గడమే ఇందుకు నిదర్శనం. ఇదే కాలంలో ప్రీమియం అపార్ట్ మెంట్లలో అమ్మకాలు 5 శాతం పెరిగాయి.
ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. 2025 జనవరి-జూన్ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 1,34,776 అపార్ట్ మెంట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గాయి. రూ.కోటి ధరలోపు అపార్ట్ మెంట్ల విక్రయాలు మాత్రం 32 శాతం తగ్గి 51,804 యూనిట్లుగా ఉన్నాయి.
రూ.కోటికి పైన ధర శ్రేణిలోని అపార్ట్ మెంట్ల అమ్మకాలు 6 శాతం పెరిగి 82,972 యూనిట్లుగా నమోదయ్యాయి. హైదరాబాద్‌తోపాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో అమ్మకాలపై జేఎల్‌ఎల్ ఇండియా నివేదిక విడుదల చేసింది. ఇక ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం అపార్ట్ మెంట్ల అమ్మకాల్లో రూ.కోటికి పైన ధరలోనివి (ప్రీమియం) 62 శాతంగా ఉండడం గమనార్హం.
క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి అమ్మకాలు మొత్తం విక్రయాల్లో 51 శాతంగా ఉన్నాయి. రూ.కోటిలోపు ఇళ్ల విక్రయాల వాటా 49 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు స్థిరంగా వృద్ధి చెందడం పెరుగుతున్న కొనుగోలు పెరుగుతున్న సామర్థ్యం, మెరుగైన జీవన ఆకాంక్షలకు నిదర్శనమని జేఎల్‌ఎల్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సమంతక్ దాస్ వ్యాఖ్యానించారు.