- హెచ్ఎండీఏ అనుమతిని లెక్క చేయని హైడ్రా..
- వాస్తవాలు తెలుసుకోకుండా గోడను కూల్చేస్తారా?
- స్థానిక కార్పొరేషన్ వద్ద వివరాలు తీసుకున్నారా?
- హెచ్ఎండీఏ అధికారులతో ముందుగా చర్చించారా?
- వేకువ జామున.. సరిహద్దు గోడను కూల్చివేస్తారా?
- భయాందోళనలో ఆరు వందల యాభై కుటుంబాలు
( కింగ్ జాన్సన్ కొయ్యడ, ఆర్ఈజీ న్యూస్): హైదరాబాద్‌లో కొన్నేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా హైడ్రా పరిష్కరిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ముక్తకంఠంతో అభినందించి తీరాల్సిందే. అయితే, కొన్ని సందర్భాల్లో హైడ్రా వెనకా ముందు చూడకుండా.. వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తుందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇందుకు చక్కటి ఉదాహరణ.. బాచుపల్లిలోని ప్రణీత్ ఏపీఆర్ ప్రణవ యాంటీలియా సరిహద్దు గోడ కూల్చివేత. కొందరు వ్యక్తులు పని గట్టుకుని.. అవాస్తవాల్ని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయడం.. వాటికి సాక్ష్యంగా కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాల్ని రాయించి.. ఏకంగా హైడ్రా కమిషనర్‌ను తప్పుదోవ పట్టించడం వల్లే.. ఈ దుస్థితికి ప్రధాన కారణమని తెలిసింది. వివరాల్లోకి వెళితే..
బాచుపల్లి నుంచి మల్లంపేట్ ఓఆర్ఆర్ (ఎగ్జిట్ 4ఏ ) సర్వీస్ రోడ్డు వరకూ వంద అడుగుల రోడ్డు వేస్తే.. మల్లంపేట్‌లో ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. కాకపోతే, బాచుపల్లి నుంచి మల్లంపేట్ ఐటీసీ వరకే హండ్రెడ్ ఫీట్ రోడ్డుంది. అక్కడ్నుంచి మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకూ ప్రస్తుతమున్న చిన్న రోడ్డును వంద అడుగులుగా వెడల్పు చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా, నిజాంపేట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం.. మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4ఏ నుంచి రెడ్డీ ల్యాబ్స్ మీదుగా ఓల్డ్ ముంబై దర్గా వరకూ వంద అడుగుల రోడ్డును అభివృద్ధి చేస్తే ఎలాంటి సమస్యలుండవు. అయితే, బృహత్ లక్ష్యాన్ని వదిలేసి.. చిన్న చిన్న కాలనీలను టార్గెట్ చేయడం ఎంతవరకూ కరెక్టో హైడ్రా అధికారులకే తెలియాలి. ఇంతకీ విషయం ఏమిటంటే.. బాచుపల్లి రెవెన్యూ విలేజ్ మ్యాప్ ప్రకారం.. 170, 170/1, 39, 40, 38, 37, 36 సర్వే నెంబర్లలో ప్రణీత్ ఆంటీలియా బిల్డర్ అడ్డుగోడ కట్టారంటూ కొందరు స్థానిక రాజకీయ నాయకులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. స్థానిక పోలీసుల సహకారంతో ఇటీవల యాంటిలీయా సరిహద్దు గోడను నేలమట్టం చేయించారు.
వాస్తవం ఏమిటంటే.. హెచ్ఎండీఏ ప్రకారం అసలీ సరిహద్దు గోడను కూల్చాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో.. యాంటిలీయా నుంచి రోడ్డు యాక్సెస్ లేదని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను గతంలో విడుదల చేసింది. అయితే, తాము ఒక గోడ బదులు మరొక గోడను కూల్చివేశామని.. హైడ్రా అధికారులు ఇంకో సరిహద్దు గోడను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరీ దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నెండేళ్ల నుంచి ఆరు వందల యాభై కుటుంబాలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవిస్తున్నాయని.. అలాంటిది, హైడ్రా వచ్చి తమను భయాందోళనలకు గురి చేస్తున్నాయని యాంటిలీయా వాసులు వాపోతున్నారు.
వంద అడుగుల రోడ్డే లేదు
ప్రణవ్ యాంటిలీయా ప్రాజెక్టులో.. ఒకే ఒక్క అరవై ఫీట్లతో పాటు ముప్పయ్ అడుగుల రోడ్లే ఉన్నాయి. అంతేతప్ప, ఇందులో ఎక్కడా వంద ఫీట్ల రోడ్డు లేనే లేదు. ఈ అరవై అడుగుల రోడ్డునే యాంటిలీయా 650 విల్లాల కుటుంబాలు, ప్రణీత్ ఎన్‌క్లేవ్ రెండు వేల కుటుంబాలు, రిజీనియా స్కైయాన్ 900 కుటుంబాలు, ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ 524 కుటుంబాలు, కొత్తగా వచ్చే రెండు టవర్లలో వెయ్యి కుటుంబాలు.. అంటే మొత్తం కలిపితే సుమారు పాతిక వేల మంది జనాభా ఈ అరవై అడుగుల రోడ్డును వినియోగిస్తున్నారు. ఓల్డ్ ముంబై హైవేను కనెక్ట్ చేస్తూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన వంద అడుగుల రోడ్డుకు.. యాంటిలీయా అరవై అడుగుల రోడ్డు మధ్య కేవలం వంద ఫీట్ల దూరం ఉంటుంది.
కాబట్టి, ఈ అరవై అడుగుల రోడ్డు జోలికి రాకుండా.. రెడ్డీ ల్యాబ్స్ ముందు నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్డు వేయడం ఉత్తమం. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా.. వెనకా ముందు చూడకుండా.. యాంటిలీయా సరిహద్దు గోడను కూల్చివేయడం దారుణమైన విషయమని యాంటిలీయా వాసులు అంటున్నారు. తమ విల్లా కమ్యూనిటీ చెరువులో లేదు.. బఫర్ జోన్‌లో కూడా లేదు.. ఎవరో వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని అందిస్తే.. అది నిజమేనని నమ్మి.. తమ కమ్యూనిటీ సరిహద్దు గోడను కూల్చడమేమిటని స్థానిక ప్రజలు హైడ్రాను నిలదీస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు హైడ్రా కూడా అధికారికంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక ఎమ్మేల్యే సపోర్టు!
తమ సరిహద్దు గోడ కూల్చివేతపై ప్రణీత్ ఏపీఆర్ ప్రణవ్ యాంటిలీయా వాసులు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా సరిహద్దు గోడను కూల్చివేయడం దారుణమని.. ఈ విషయంపై అధికారులతో చర్చిస్తామని.. యాంటిలీయా వాసులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. మరి, ఇప్పటికైనా హైడ్రా చేసిన తప్పును గుర్తించి.. కూల్చివేసిన తమ సరిహద్దు గోడను తిరిగి కట్టించాలని ప్రణీత్ యాంటిలీయా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.