General
హైదరాబాద్ లో 5 ఏళ్లు అడ్వాన్స్ గా ఇళ్ల ధరలు

2023 డిసెంబరు నుంచి హైదరాబాద్‌లో రియాల్టీ నెమ్మదించింది. చతికిల పడిపోయింది అని కూడా చెప్పొచ్చు. గ్రేటర్ సిటీలో నివాస, వాణిజ్య నిర్మాణాలు జరుగుతున్నా.. ఇళ్ల అమ్మకాలు అంత స్పీడుగా లేవు. రెండేళ్ల క్రితం వరకు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిన రియాల్టీ మార్కెట్.. ఇప్పుడు నేల చూపుల్ని చూస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఆశించినంత మేర పెరుగుదల చూపే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా స్థిరమైన వృద్ధిని సాధించిన భాగ్యనగర నిర్మాణ రంగం.. ప్రస్తుతం దీర్ఘకాలిక తిరోగమనంలో పయనిస్తోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఐదేళ్ల ధరలు.. ఇప్పుడే!
హైదరాబాద్ రియాల్టీ నెమ్మదించడానికి ప్రధాన కారణం.. పెరిగిన ధరలే. 2018 నుంచి 2023లో అడ్డూఅదుపూ లేకుండా భూముల ధరలు పెరిగాయి. ఫలితంగా, దాన్ని ప్రభావం ఫ్లాట్ల ధరల మీద పడింది. అధిక శాతం బిల్డర్లు పోటీపడి ధరల్ని పెంచేవారు. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. వచ్చే ఐదేళ్లలో పెరగాల్సిన రేట్లను డెవలపర్లు ఇప్పుడే పెంచి కూర్చుకున్నారు. అందుకే, ఫ్లాట్లను కొనడానికి అధిక శాతం మంది ముందుకు రావడం లేదు. అందుకే, గత రెండేళ్ల నుంచి ఫ్లాట్ల ధరలు తగ్గడమే తప్ప పెరగలేదనే విషయాన్ని గమనించాలి.
క్రమంగా తగ్గుతున్న ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్‌లో గత సంవత్సరం 2024లో మొత్తం 32,974 ఇళ్లు విక్రయించారని, 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం సిటీలో అపార్ట్ మెంట్ల సగటు ధర చదరపు అడుగుకు 6 వేల రూపాయలుగా ఉంది. గత ఏడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అయితే అంతకు క్రితం సంవత్సరంతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్ లో క్షీణత నమోదయినట్లుగా తెలుస్తోంది.
ALSO READ: ఆకాశహర్మ్యాలకు అనుమతుల్లేవ్!
ప్రస్తుతం హైదరాబాద్ లో లక్షా 20 వేల గృహాల ఇన్వెంటరీ ఉందని పలు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాకపోతే చిన్నాచితకా అన్నీ కలిపితే సుమారు రెండు లక్షల దాకా అన్‌సోల్ట్ స్టాకు ఉందని సమాచారం. ఇంతలో కొత్త ప్రాజక్టులు వస్తే ఇన్వెంటరీ మరింతగా పెరుగుతుందని వేరే చెప్పక్కర్లేదు.
తగ్గుతున్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు
అమెరికాలో ట్రంప్ నిర్ణయాలతో అక్కడి నుంచి వచ్చే ఎన్ఆర్ఐ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అందుకే దాన్ని ప్రభావం నగర రియాల్టీపై పడింది. ఈమధ్య కాలంలో హైదరాబాద్‌లో బిల్డర్ల వద్ద కాకుండా.. ఇన్వెస్టర్ల నుంచి కొనుక్కునేవారి సంఖ్య పెరిగింది. అధిక ధరల కారణంగా.. మరికొందరు పాత ఇళ్లను కొనుక్కుంటున్నారు. లేకపోతే అద్దె ఇళ్లల్లో నివసించడానికే ఆసక్తి చూపిస్తున్నారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యం జరగడం రియాల్టీ దెబ్బతినడానికి మరో కారణమని చెప్పొచ్చు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ వంటివి ఆలస్యం కావడంతో రియాల్టీలో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య తగ్గుతుంది.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available