General

ప్రీలాంచ్‌లో ఫుల్ సేల్స్‌.. రెరా త‌ర్వాత నిల్ సేల్స్‌..

ప్రీలాంచ్‌లో ఫుల్ సేల్స్‌.. రెరా త‌ర్వాత నిల్ సేల్స్‌..
  • తొలుత తక్కువ ధరకు అమ్మకాలు.. 
  • ఆ తర్వాత ఫ్లాట్లు అమ్మలేక బిల్డర్ల ఇబ్బందులు

ఆర్ఈజీ న్యూస్‌, హైద‌రాబాద్‌: 
ప్రీలాంచ్‌లో తక్కువ ధరలకు ఫ్లాట్లు విక్రయించిన కొంతమంది బిల్డర్లకు ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. ప్రారంభ దశలో చదరపు అడుగు రూ.4 వేల నుంచి రూ.5 వేలకే అమ్మకాలు జరిపిన డెవలపర్లు.. రెరా అనుమతులు వచ్చిన తర్వాత ధరలను రూ.7 వేల నుంచి రూ.8 వేలకు పెంచాలని భావిస్తున్నారు. అయితే పెరిగిన ధరలకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో మిగిలిన ఫ్లాట్ల విక్రయాలు కష్టంగా మారుతున్నాయి.

ప్రీలాంచ్‌ ధరలకు.. ప్రస్తుత మార్కెట్‌కు మధ్య అంతరం

ప్రాజెక్టు ప్రారంభ దశలో తక్కువ ధరలకు ఫ్లాట్లు విక్రయించి పెట్టుబడులు సమీకరించడం బిల్డర్ల వ్యూహం. అనంతరం అనుమతులు, నిర్మాణ పురోగతిని బట్టి ధరలు పెంచి మిగిలిన ఫ్లాట్లను విక్రయించాలని భావిస్తారు. కానీ మార్కెట్‌లో కొనుగోళ్లు మందగించడం, చుట్టుపక్కల ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఫ్లాట్లు అందుబాటులో ఉండటంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు.

ధర పెంచితే కొనేవారేరీ?

ప్రీలాంచ్‌లో తక్కువ ధరకు విక్రయాలు జరిపిన తర్వాత మిగిలిన ఫ్లాట్లను అధిక ధరలకు అమ్మడం కొంతమంది బిల్డర్లకు సవాలుగా మారుతోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాలు, మార్కెట్‌ పోటీ, కొనుగోలుదారుల బడ్జెట్‌ వంటి అంశాలు విక్రయాలపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు తక్కువ ధరలకు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, బిల్డర్‌ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి అప్పగిస్తాడా? రెరా నమోదు, నిర్మాణ అనుమతులు సక్రమంగా ఉన్నాయా? అన్నది కొనుగోలుదారులు తప్పనిసరిగా పరిశీలించాలి. ప్రీలాంచ్‌లో తక్కువ ధరకు అమ్మడం బిల్డర్లకు పెట్టుబడుల సమీకరణలో ఉపయోగపడినా.. ఆ తర్వాత మిగిలిన ఫ్లాట్లను ఆశించిన ధరలకు విక్రయించడం మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు.

మియాపూర్‌కు కూకట్‌పల్లి ధరల పోటీ

మియాపూర్‌లో చదరపు అడుగు ధర రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటే, కూకట్‌పల్లిలో కొన్ని ప్రాజెక్టుల్లో రూ.5 వేల నుంచే ధరలు అందుబాటులో ఉన్నయి. ఈ వ్యత్యాసం మియాపూర్‌ ప్రాజెక్టుల అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు, 1,500 చదరపు అడుగుల ఫ్లాట్‌పై చదరపు అడుగుకు రూ.3 వేల తేడా ఉంటే మొత్తం ధరలో రూ.45 లక్షల వ్యత్యాసం వస్తుంది. దీంతో కొనుగోలుదారులు ధరలను పోల్చుకుని నిర్ణయం తీసుకుంటున్నారు.