General

మెట్రో దిగగానే పాడ్‌ ట్యాక్సీ.. 

మెట్రో దిగగానే పాడ్‌ ట్యాక్సీ.. 

హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్య‌వ‌స్థ‌కు ప్రణాళిక

హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌ పెట్టేందుకు మరో కొత్త రవాణా వ్యవస్థకు ప్రణాళిక సిద్ధమవుతోంది.. మెట్రో రైలు దిగగానే.. స్టేషన్‌ నుంచే డ్రైవర్‌ లేని పాడ్‌ ట్యాక్సీలో ఎక్కి నేరుగా ఆఫీసుకు చేరుకునే అవకాశం రాబోతోంది.. ఐటీ కారిడార్‌, నాలెడ్జ్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, సచివాలయం పరిసరాలను కలుపుతూ.. మొత్తం 40.82 కిలోమీటర్ల పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌ను ప్రతిపాదించారు.. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికను మెట్రో అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.. మరి ఈ పాడ్‌ ట్యాక్సీ ఎలా పనిచేస్తుంది? ఏయే ప్రాంతాలను కలుపుతుంది? ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • హైదరాబాద్‌లో 40.82 కి.మీ. పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌ ప్రతిపాదన.
  • ఐటీ కారిడార్‌, నాలెడ్జ్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, 
    సచివాలయం పరిసరాలకు అనుసంధానం.
  • మొత్తం నాలుగు ప్రధాన కారిడార్లుగా నెట్‌వర్క్‌ రూపకల్పన.
  • కూకట్‌పల్లి-రాయదుర్గం మార్గంలో 7.62 కి.మీ. ప్రతిపాదన.
  • రాయదుర్గం-నాలెడ్జ్‌ సిటీ మార్గంలో 12.83 కి.మీ. నెట్‌వర్క్‌.
  • ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ కారిడార్‌లో 14.01 కి.మీ. మార్గం.
  • సచివాలయం-ఎన్టీఆర్‌ మార్గ్‌ కారిడార్‌లో 6.36 కి.మీ. ప్రతిపాదన.
  • 2030 నాటికి 34.66 కి.మీ., 2050 నాటికి పూర్తి నెట్‌వర్క్‌ లక్ష్యం.
  • 2050 నాటికి రోజుకు 20.31 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా.
  • డ్రైవర్‌ అవసరం లేని ఆటోమేటెడ్‌ విద్యుత్‌ వాహనాలుగా పాడ్‌ ట్యాక్సీలు.


హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి ప్రత్యామ్నాయంగా పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను పరిశీలిస్తున్నారు.. లీ అసోసియేట్స్‌ సంస్థ మూడు నెలలపాటు అధ్యయనం చేసి.. వివిధ మార్గాల ప్రతిపాదనలను పరిశీలించింది.. అనంతరం 40.82 కిలోమీటర్ల హైబ్రిడ్‌ నెట్‌వర్క్‌ను అనుకూలంగా సూచించింది.. ఈ నెట్‌వర్క్‌లో నాలుగు ప్రధాన కారిడార్లు ఉండనున్నాయి. కూకట్‌పల్లి-రాయదుర్గం మార్గంలో 7.62 కిలోమీటర్లు.. రాయదుర్గం-నాలెడ్జ్‌ సిటీ మార్గంలో 12.83 కిలోమీటర్లు.. రాయదుర్గం లేదా హైటెక్‌ సిటీ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు 14.01 కిలోమీటర్లు.. సచివాలయం-ఎన్టీఆర్‌ మార్గ్‌ కారిడార్‌లో 6.36 కిలోమీటర్ల మేర నెట్‌వర్క్‌ను ప్రతిపాదించారు.. ఈ ప్రణాళిక అమలైతే ఐటీ ఉద్యోగులు, కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులకు మరో రవాణా మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌ను దశలవారీగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.. 2030 నాటికి 34.66 కిలోమీటర్లు.. 2040 నాటికి 39.36 కిలోమీటర్లు.. 2050 నాటికి పూర్తి స్థాయిలో 40.82 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రణాళిక.. ప్రయాణికుల సంఖ్యపైనా నివేదిక అంచనాలు రూపొందించింది.. 2030లో రోజుకు 5.42 లక్షల మంది.. 2040లో 15.47 లక్షల మంది.. 2050 నాటికి 20.31 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేసింది.. అయితే ఇవి భవిష్యత్తు ప్రయాణ అవసరాల ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమే.. వాస్తవ ప్రయాణికుల సంఖ్య టికెట్‌ ధరలు, మార్గాల అనుసంధానం, సేవల విస్తృతిపై ఆధారపడి ఉంటుంది..

పాడ్‌ ట్యాక్సీ అంటే డ్రైవర్‌ అవసరం లేకుండా ఆటోమేటెడ్‌ సాంకేతికతతో నడిచే చిన్న విద్యుత్‌ వాహనం.. సాధారణంగా ప్రత్యేక మార్గం లేదా ఎలివేటెడ్‌ ట్రాక్‌పై ప్రయాణించేలా వీటిని రూపొందిస్తారు.. కంప్యూటర్‌ ఆధారిత నియంత్రణ వ్యవస్థలతో నిర్దేశిత స్టేషన్ల మధ్య ప్రయాణించే విధానం ఇందులో ఉంటుంది.. హైదరాబాద్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కో పాడ్‌లో నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణించే విధానాన్ని ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు.. అయితే వాహనాల సామర్థ్యం, వేగం, స్టేషన్ల సంఖ్య, ప్రయాణాల మధ్య విరామం వంటి అంశాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

మెట్రో స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కార్యాలయానికి వెళ్లేందుకు ఆటో లేదా క్యాబ్‌ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఎదురవుతోంది.. ఈ సమస్యను తగ్గించడమే పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.. మెట్రో నుంచి పాడ్‌ ట్యాక్సీకి.. అక్కడి నుంచి కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలకు సులభంగా చేరుకునేలా అనుసంధానం కల్పిస్తే ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.. అయితే ఈ వ్యవస్థ విజయవంతం కావాలంటే మెట్రో స్టేషన్లతో సరైన అనుసంధానం, అందుబాటు ధరలు, భద్రత, నిర్వహణ కీలకం.

పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థపై దేశంలోని ఇతర నగరాల్లోనూ ప్రణాళికలు రూపొందుతున్నాయి.. ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌ పరిధిలో 8.85 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ నెట్‌వర్క్‌ను సుమారు 1,016 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.. హైదరాబాద్‌లోనూ ఇదే తరహా వ్యవస్థను పరిశీలిస్తున్నప్పటికీ.. రెండు ప్రాజెక్టుల వ్యయాలను నేరుగా పోల్చలేం.. మార్గాల పొడవు, నిర్మాణ పరిస్థితులు, స్టేషన్ల సంఖ్య, సాంకేతిక నమూనాను బట్టి ఖర్చులు మారుతాయి.. హైదరాబాద్‌ పాడ్‌ ట్యాక్సీ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.. అయితే మొత్తం ప్రాజెక్టు వ్యయం ఎంత..? ప్రైవేటు సంస్థల పెట్టుబడి ఎంత..? ప్రయాణికులకు టికెట్‌ ధర ఎంత ఉండనుంది..? నిర్మాణ పనులు ఎప్పటిలోగా ప్రారంభమవుతాయి..? అనే అంశాలపై ఇంకా తుది స్పష్టత రావాల్సి ఉంది.. ప్రయాణికులకు అందుబాటు ధరల్లో సేవలు అందించడంతో పాటు.. నిర్వహణ, భద్రత, సాంకేతిక వ్యవస్థల ఖర్చులను సమతుల్యం చేయడం ప్రాజెక్టుకు కీలకం కానుంది.