- 9 ఏళ్లు అయినా కొనుగోలుదారులకు ఫ్లాట్లు ఇవ్వని నెబ్యులా పసిఫికా కన్ స్ట్రక్షన్స్
- బాచుపల్లిలో పసిఫికా నెబ్యులా ఆవాస్ పేరుతో 2016లో ప్రాజెక్టు ప్రారంభం
- ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో కొనుగోలుదారుల ఆందోళన
హైదరాబాద్ లో మరో రియల్ మోసం వెలుగులోకి వచ్చింది. దిగువ మధ్యతరగతి ప్రజలు లక్ష్యంగా ప్రాజెక్టు చేపట్టిన ఓ కంపెనీ కొనుగోలుదారులకు ఫ్లాట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. దీంతో బాధితులు ప్రాజెక్టు సైట్ లో ఆందోళనకు దిగారు. గుజరాత్ కు చెందిన నెబ్యులా ఫసఫికా కన్ స్ట్రక్షన్స్ కంపెనీ పసిఫికా నెబ్యులా ఆవాస్ పేరుతో బాచుపల్లిలో 2016లో ఓ ప్రాజెక్టు లాంచ్ చేసింది.
9.8 ఎకరాల స్థలంలో 565 నుంచి 925 చదరపు గజాల పరిమాణంలో 1, 2 బీహెచ్ కే ఫ్లాట్లు నిర్మిస్తామని ప్రకటించి కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసింది. 2020లో ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పినా.. ఆ సమయానికి ఇవ్వలేకపోయింది.
కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయని కొంత కాలం.. అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదిస్తూ వస్తోంది. చివరకు ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2025 జూన్ వరకు గడువు తెచ్చుకుంది. ప్రస్తుతం జూన్ పూర్తయి జూలై వచ్చినా పనులు అలానే ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు ప్రాజెక్టు సైట్ వద్ద ఆందోళనకు దిగారు.
ప్రాజెక్టు ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తయినా.. తమకు ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అప్పులు చేసి కంపెనీకి చెల్లించామని, వాటిపై వడ్డీలు కట్టేలేక, మరోవైపు ఇంటి అద్దెలు కట్టుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెరా ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.