General
ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఫోర్త్ సిటీ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లకు ధీటుగా ప్రపంచస్థాయిలో ఫోర్త్ సిటీని నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో ఫోర్త్ సిటీలో మౌళిక వసతులకు పెద్దపీట వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ఫోర్త్ సిటీ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్టివీటీపై దృష్టి సారించింది. ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి నేరుగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణ అధికారులు చర్చించగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మౌలిక వసతులపై దృష్టి సారించింది. ఇప్పటికే ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం మొదలవ్వగా ఇప్పుడు ఏఐ సిటీ నిర్మాణానికి సర్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో పలు ప్రభుత్వ సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఫోర్త్ సిటీ నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివీటీ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపే విధంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డును నిర్మించాలని డిసైడ్ అయిన రేవంత్ సర్కార్.. నూతన ఎక్స్ ప్రెస్ హైవే, డ్రైపోర్టు-పోర్టు రైలు మార్గాల నిర్మాణంతో ఎగుమతులు, దిగుమతులు సులభతరం చేయొచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా ఫోర్త్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించాలని భావిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ శివారులో జడ్చర్ల పరిసరాల్లో నిర్మించాలని భావిస్తున్న డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గంపైనా సమాలోచనలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ ఇటీవలే నిర్వహించిన సమావేశంలో అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిటేయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రస్తుతం 65వ నంబరు జాతీయ రహదారి ఉంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే హైదరాబాద్ నుంచి కాకుండా.. ఫోర్త్ సిటీ నుంచి ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.
అమరావతి-ఫోర్త్ సిటీని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే.. విజయవాడ-హైదరాబాద్ ప్రస్తుత జాతీయ రహదారికి అది సమాంతర రహదారి అవుతుంది. ప్రస్తుత జాతీయ రహదారికి అటూ ఇటుగా 10 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మిస్తే స్పెషల్ బెల్ట్ గా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ సర్కార్ యోచనగా తెలుస్తోంది. రెండు జాతీయ రహదారులకు మధ్యలో ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో సముద్రం, తీర ప్రాంతం లేకపోవడంతో నౌకాశ్రయాలు లేవు. బియ్యం, సిమెంటు, చమురు, ఎరువుల ఎగుమతులు, దిగుమతులకు రవాణాపరంగా ఖర్చు పెరగడంతోపాటు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఏపీ రాజధాని అమరావతి నుంచి వచ్చే ఎక్స్ ప్రెస్ హైవేకు హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసే జంక్షన్ వద్ద డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ డ్రైపోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పోర్ట్ వరకు కొత్త రైలు మార్గం నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
సాధారణ పోర్ట్ తరహాలో డ్రైపోర్టులో కంటెయినర్ యార్డులు, కార్గో నిర్వహణ వంటి కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇలా ఫోర్త్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే, డ్రైపోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్ట్ వరకు రైలు మార్గం ఏర్పాటు చేస్తే ఫోర్త్ సిటీ పరిసరాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరిగిపోవడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో యధావిధిగా ఫోర్త్ సిటీతో పాటు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.