General
వచ్చే రెండేళ్లలో వర్క్ మోడ్ లోకి ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రెడీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు నెల రోజుల క్రితమే ప్రభుత్వానికి అందాయి. ఇప్పటికే ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభం అవ్వగా.. ఫ్యూచర్ సిటీ పనులు ఆగష్టు రెండో వారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలోనే ఏఐ సిటీతో పాటు పూర్తిస్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించిన మౌళిక వసతుల ఏర్పాట్లు మొదలుపెట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
దేశంలోనే ఇది మొట్ట మొదటి నెట్-జీరో గ్రీన్ ఫీల్డ్ సిటీ అవబోతోందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే ఫ్యూచర్ సిటీ నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యం దాదాపు సున్నా ఉంటుంది. ప్రపంచ స్థాయి గ్రీన్ ఫార్మా కంపెనీలు, పలు జాతీయ-అంతర్జాతీయ యూనివర్సిటీలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్ వేర్ సంస్థలు ఒకేచోట ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇది పరిశ్రమ, విద్య, సాంకేతికతకు మధ్య ఒక సంధానకర్తగా వ్యవహరించి, సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఫ్యూచర్ సిటీని పలు భాగాలుగా విభజించారు. ఇందులో ఎలక్ట్రిక్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, గ్రీన్ బిల్డింగ్, స్మార్ట్ లివింగ్, ఎకో సిస్టమ్ వంటి విభాగాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నొవేషన్ లాంటి స్పెషల్ జోన్లు ఉంటాయి. ఫోర్త్ సిటీలో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఫోర్త్ సిటీలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని నిర్మాణాలూ పర్యావరణానికి హాని చేయకుండా, స్మార్ట్ సిటీ నియమాలకు లోబడి ఉండేలా చూడనున్నారు. ఏడు మండలాల్లోని 56 గ్రామాల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ సిటీని ఏర్పాటు చేసే మాస్టర్ ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.
వచ్చే 50 ఏళ్లకు మాస్టర్ ప్లాన్
ఫ్యూచర్ సిటీలో దాదాపు 15 వేల ఎకరాలు ఫారెస్ట్ ఏరియా ఉండేలా మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యింది. దీనిని మరింత ఎకో ఫ్రెండ్లీగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫోర్త్ సిటీలోని ఫార్మాసిటీ కోసం టీజీఐఐసీ ఇప్పటికే 14 వేల ఎకరాల భూమిని సేకరించింది. అయితే ఇందులో రెండున్నర వేల ఎకరాలకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. దీనిని త్వరలోనే క్లియర్ చేసి.. మాస్టర్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (ఎఫ్ సీడీఏ) పరిధి విస్తరించి ఉన్న సుమారు 2 లక్షల ఎకరాల వరకూ వచ్చే 50 ఏళ్లకు పక్కా ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు.
రెండేళ్లలో వర్క్ మెడ్ లోకి ఫ్యూచర్ సిటీ
ఇక ఫ్యూచర్ సిటీని కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పూర్తిగా వర్క్ మోడ్ లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తోంది. దీంతో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేయడంతో పాటు అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ వచ్చే రెండేళ్లలో ఒక షేప్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ సంస్థ ఫ్యూచర్ సిటీని ఎలా నిర్మించాలి? ఎలాంటి సౌకర్యాలు ఉండాలి? పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి? వంటి విషయాలపై పూర్తి వివరాలతో కూడిన ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సిటీలో నిర్మించబోయే నివాస ప్రాజెక్టులు, ఇళ్లు చాలా ఆధునికంగా, విద్యుత్, నీటిని ఆదా చేసే విధంగా నెట్ జీరోగా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో ఉండనున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న మధ్య తరగతి వారికి సైతం ఫ్యూచర్ సిటీలో అందుబాటు ధరల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్.
నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ
ఫ్యూచర్ సిటీలో ఆరోగ్యం, విద్య, వినోదానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు దగ్గర్లోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు అధికారులు. ప్రతి ఇంటి పరిసరాల్లో పార్కులు, ఆట స్థలాలు, కల్చరల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు, ఫ్యూచర్ సిటీలో కాలుష్యం లేకుండా (నెట్-జీరో) ఉండడమే ప్రధాన లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ సిద్దమైంది. దీని కోసం సౌరశక్తి లాంటి పునరుత్పాదక శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తారు. గ్రీన్ బిల్డింగ్స్, నీటిని ఆదా చేసే పద్ధతులు, చెత్తను సరిగ్గా నిర్వహించడం, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు.
ఈ సిటీలో వ్యాపారాలు చేసేవాళ్లు కూడా ఈ పర్యావరణ నియమాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు. ఇక ఫ్యూచర్ సిటీలో దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఏఐ, ఫిన్ టెక్ , లైఫ్ సైన్సెస్, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సులభమైన ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఏఐకి 297 ఎకరాలు, యూనివర్సిటీల జోన్ కు 454 ఎకరాలు, ఎంటర్ టైన్మెంట్ కు 470 ఎకరాలు, ఫార్మా పార్క్ కు 309 ఎకరాలు, హెల్త్ సిటీకి 370 ఎకరాలు, స్పోర్ట్స్ హబ్ కు 761 ఎకరాలను ఇచ్చేందుకు ప్రాథమికంగా ప్లాన్ రెడీ చేశారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే-మెట్రో రైల్ తో అనుసంధానం
ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఇక మెట్రో రైలు మార్గాన్ని కూడా ప్యూచర్ సిటీ లోపలి వరకు నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సర్వే చేపట్టడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా కొంగరకలాన్ ఎగ్జిట్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మీదుగా మీర్ ఖాన్ పేట వరకు సుమారు 39.6 కిలో మీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు డీపీఆర్ ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రభుత్వానికి నివేదించింది.
ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందుకోసం కావాల్సిన స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఆర్కిటెక్చర్స్ ను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో క్రికెట్, ఫుట్ బాల్, గోల్ఫ్ వంటి అన్ని క్రీడలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available