కొనుగోలుదారులకు డెవలపర్ వాగ్దానం చేసిన సౌకర్యాలు, కార్ పార్కింగ్ వంటివి ఇవ్వని సందర్భంలో అపార్ట్ మెంట్ ను స్వాధీనం చేసుకోవడానికి నిరాకరించొచ్చని మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. ఈ విషయంలో మహా రెరా తీర్సును సమర్థించింది.
ముంబై బాంద్రా వెస్ట్ లోని ఓ భవనంలో ఇద్దరు వ్యక్తులు రెండు అపార్ట్ మెంట్లు కొనుగోలు చేశారు. 15 అంతస్తుల ఆ భవనంలో 12వ అంతస్తులో 2,460 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ని రూ.13 కోట్లకు బుక్ చేసుకున్నారు. 2015 డిసెంబర్ లో సేల్ అగ్రిమెంట్ జరగ్గా.. 2016 జూన్ లో హామీ ఇచ్చిన ఎమినిటీస్ తో ఫ్లాట్ ను స్వాధీనం చేయాల్సి ఉంది. ఒకవేళ నిర్దేశిత తేదీ లోపు ఫ్లాట్ అప్పగించకుంటే, డెవలపర్ ఆ ఫ్లాట్ ను అప్పగించే వరకు కొనుగోలుదారుల నుంచి అందుకున్న మొత్తంపై ఏడాదికి 18 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
ఆ వడ్డీని డెవలపర్ కు కొనుగోలుదారు చెల్లించాల్సిన బ్యాలెన్స్ నుంచి తీసివేయాలి. అయితే, నిర్దేశిత తేదీలోగా ఫ్లాట్ స్వాధీనం చేయడంలో డెవలపర్ విఫలమయ్యాడు. 2017 ఆగస్టులో కూడా ఇంకా పని కొనసాగుతోందని, ఈలోగా ఫ్లాట్ స్వాధీనం చేసుకోవాలని కోరాడు. భవనం అసంపూర్తిగా ఉండటంతోపాటు ఒప్పందంలో వాగ్దానం చేసిన అన్ని సౌకర్యాలతో కూడిన ఫ్లాట్‌లను అప్పగించే స్థితిలో లేనందును తాము స్వాధీనం చేసుకోబోమని కొనుగోలుదారులు నిరాకరించారు. ఇందులో రెండు ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ స్లాట్ లు కూడా ఉన్నాయి. పైగా ఆలస్యానికి చెల్లించాల్సిన వడ్డీని లెక్కించకుండా మిగిలిన మొత్తం చెల్లించాలని డెవలపర్ పట్టుబట్టాడు. దీంతో వారు మహా రెరాకి ఫిర్యాదు చేశారు.
ALSO READ: లక్ష సంపాదిస్తున్నా.. ఇంటి లక్ష్యం నెరవేరట్లే
అన్ని వివరాలూ పరిశీలించిన రెరా.. కొనుగోలుదారులు చెల్లించిన మొత్తంపై 10.5 శాతం సాధారణ వడ్డీ ఇవ్వాలని, అలాగే వాగ్దానం చేసిన అన్ని సౌకర్యాలతో ఫ్లాట్ స్వాధీనం చేయాలని డెవలపర్ ను ఆదేశించింది. అలాగే 118 చదరపు అడుగుల లిఫ్ట్ లాబీ ప్రాంతానికి వసూలు చేసిన రూ.61 లక్షలకు పైగా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సూచించింది. ఫిర్యాదు ఖర్చుల నిమిత్తం ఇరువురికీ చెరో రూ.20వేలు చెల్లించాలని స్పష్టంచేసింది. అయితే, దీనిని డెవలపర్ మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో సవాల్ చేశాడు.
12వ అంతస్తు వరకు ఫ్లాట్‌లకు ఓపెన్ కార్ పార్కింగ్ స్థలాల కోసం ఏర్పాట్లు చేశారని డెవలపర్ నివేదించారు. ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయకపోయినా లేదా ఆ ఆఫర్ చేసిన తేదీన అమలులో లేనప్పటికీ, గృహ కొనుగోలుదారుల కోసం భవన ప్రాంగణంలో తగినంత ఓపెన్ పార్కింగ్ అందుబాటులో ఉందని వాదించారు. అందువల్ల ఫ్లాట్‌లను స్వాధీనం చేసుకోవడానికి గృహ కొనుగోలుదారులు నిరాకరించడం అసమంజసమని, సమర్థించలేనిదని పేర్కొన్నారు. వాదనలు విన్న ట్రిబ్యునల్.. మహా రెరా తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
