General

స్థిరాస్తిని కొన్నాక మ్యుటేషన్ చేసుకోవాలని మీకు తెలుసా?

స్థిరాస్తిని కొన్నాక మ్యుటేషన్ చేసుకోవాలని మీకు తెలుసా?
ఇల్లు లేదా ఫ్లాట్ కొనేట‌ప్పుడు రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే స‌రిపోతుంద‌ని భావిస్తుంటారు. కానీ, ఆ త‌ర్వాత ఆయా ఆస్తిని మ‌న పేరు మీద బ‌దిలీ అయ్యిందా? లేదా? అనే అంశం కూడా ముఖ్య‌మ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోండి. నిన్న‌టివ‌ర‌కూ ధ‌ర‌ణీ, ఇప్పుడేమో భూభార‌తి వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచి.. రిజిస్ట్రేష‌న్‌తో పాటు మ్యుటేష‌న్ ఛార్జీల‌ను ప్ర‌త్యేకంగా తీసుకుంటారు. మ‌న ప్రాప‌ర్టీ రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించిన వివ‌రాల్ని స్థానిక రెవెన్యూ లేదా మున్సిప‌ల్ కార్యాల‌యాల‌కు పంపిస్తున్నారు. అక్క‌డే కొనుగోలు చేసిన స్థిరాస్తికి య‌జ‌మానిగా పేరు రికార్డుల్లో న‌మోదు అవుతుంది. రెవెన్యూ పరిభాషలో స్థిరాస్తి హక్కుల బదలాయింపును మ్యుటేషన్‌ అంటారు. మ్యుటేషన్ అంటే రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తి టైటిల్‌ మార్పు అన్నమాట. ఇంకా అర్దమయ్యేలా చెప్పాలంటే ఆస్తి పత్రాలపై యజమానుల పేర్ల మార్పు. మ్యుటేషన్ అనేక సందర్భాల్లో జరుగుతుంది. వారసత్వంగా స్థిరాస్తి సమకూరినా.. ఆ విషయం అధికారికంగా నమోదు చేయాలి. ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు కూడా ఆస్తి పత్రాలపై కొత్త యజమాని పేరు నమోదు చేయించాలి. ALSO READ: హైదరాబాద్ లో గజం రూ.3 లక్షలు ఇది రెవెన్యూ రికార్డులతో పాటు స్థానిక పరిపాలన సంస్థ మున్సిపాలిటీ రికార్డుల్లోనూ నమోదు కావాల్సి ఉంటుంది. ఎవరైనా తనకు నచ్చిన వ్యక్తికి ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. మనం కొన్న స్థిరాస్తికి సంబంధించిన స్థానిక పరిపాలన కార్యాలయం పన్ను విధింపు ఎవరి పేరుతో చేయాలో కూడా అధికారులు మ్యుటేషన్‌ తోనే నిర్ణయిస్తారు. ఒకవేళ‌ మ్యుటేషన్ జరగకపోతే గతంలో ఉన్న యజమాని పేరుతో పన్ను మదింపు చేస్తారు. అందుకే ఆస్తులు చేతులు మారినప్పుడల్లా దాని మ్యుటేషన్‌ తప్పనిసరిగా జరగాలి. తండ్రి నుంచి పిల్లలకు ఆస్తులు సంక్రమించినా.. వారి తదనంతరం లేదా బతికి ఉన్నప్పుడే పిల్లల పేర్లతో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేసినా ఇలా సదరు ఆస్తులకు కొత్త యజమానులు వస్తారు. ఈ విషయాన్ని అధికారికంగా రెవెన్యూ, మున్సిపల్‌ రికార్డుల్లో నమోదు చేయడమే మ్యుటేషన్‌. ఇది ఆస్తుల కొనుగోలు సందర్భంగా కూడా చేయాల్సి ఉంటుంది. మ్యుటేషన్‌ ప్రక్రియ జరిగితేనే ఒక ఆస్తిపై కొత్త యజమానికి పూర్తి అధికారం దక్కుతుంది. లేదంటే యాజమాన్య హక్కులు అసంపూర్ణంగా ఉంటాయి.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available