- అన్ లిస్టెడ్ సంస్థల్లో అదానీ టాప్
- గ్రోహె-హురున్ ఇండియా నివేదిక వెల్లడి
భారతదేశంలోని అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ సంస్థలలో డీఎల్ఎఫ్, లోధా సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఇక అన్ లిస్టెడ్ సంస్థల్లో అదానీ రియల్టీ టాప్ లో ఉంది. ఈ మేరకు వివరాలను గ్రోహె-హురున్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ సంస్థల సంచిత విలువ రూ.16 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే రూ.1.9 లక్షల కోట్లు పెరిగింది. 2025 గ్రోహె-హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 150 నివేదిక ప్రకారం.. లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ రూ.2.07 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో నిలిచింది.
తరువాత, లోధా డెవలపర్స్ రూ.1.38 లక్షల కోట్ల విలువతో రెండవ స్థానంలో ఉండగా.. ఇండియన్ హోటల్స్ కంపెనీ రూ.1.08 లక్షల కోట్ల విలువతో మూడవ స్థానంలో ఉంది. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ.71,500 కోట్ల విలువతో నాల్గవ స్థానంలో, గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.70,600 కోట్ల విలువతో ఐదవ స్థానంలో ఉన్నాయి. ఒబెరాయ్ రియాల్టీ రూ.69,400 కోట్ల విలువతో ఆరో స్థానంలో ఉండగా.. ది ఫీనిక్స్ మిల్స్ రూ.55,900 కోట్ల విలువతో జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన అదానీ రియాల్టీ రూ.52,400 కోట్ల విలువతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.
అదానీ రియాల్టీ అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ అని నివేదిక పేర్కొంది. ఇక రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓయో నేరుగా టాప్ 15లోకి ప్రవేశించినట్టు నివేదిక తెలిపింది. నగరాల్లోని కంపెనీలను బట్టి చూస్తే జాబితాలో 42 కంపెనీలతో (9 పెరుగుదల) ముంబై అగ్రస్థానంలో ఉండగా.. తరువాత బెంగళూరు 23 (8 పెరుగుదల) తో, న్యూఢిల్లీ 16 (2 పెరుగుదల) తో, హైదరాబాద్, పుణెలో 13 చొప్పున కంపెనీలతో వరసగా ఉన్నాయి. ఈ నగరాలన్నీ కలిపి అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ కంపెనీల జాబితాలో 71% వాటా కలిగి ఉన్నాయి.