- పట్టణాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు?
- వచ్చే పదేళ్లలో పట్టణాల్లో జనాభా పెరుగుతుంది
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రిక్రియేషన్ డెవలప్ చేయాలి
- పట్టణాలు వైబ్రెంట్‌గా దర్శనమివ్వాలి..
- క్రెడాయ్ తెలంగాణకు బలమైన సెక్రటేరియట్ కావాలి
- పట్టణాల్లో పర్యటించి.. బిల్డర్ల సమస్యలు తెలుసుకుంటాం
- వాటి పరిష్కారానికి కార్యచరణను రూపొందిస్తాం
- ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా పని చేస్తాం..
(కొయ్యడ జాన్సన్, 9030034591)
తెలంగాణ రాష్ట్రంలో కేవలం హైదరాబాదే కాకుండా పట్టణాలూ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని.. ద్వితీయ, తృతీయ శ్రేణీ పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చాల్సిన ఆవశ్యకత ఉందని.. వీటి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ (ఎలక్ట్) ఎస్ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. క్రెడాయ్ తెలంగాణ చేంజాఫ్ గార్డ్ సెరమనీలో పాల్గొన్న ఆయన ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. సారాంశం ఎస్ రాంరెడ్డి మాటల్లోనే..
నేను తెలంగాణకు చెందిన బిడ్డను. ఫలానా ప్రాంతానికి చెందినవాడిని అని ఎప్పుడు చెప్పను. కాకపోతే, యావత్ తెలంగాణతో నాకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆదిలాబాద్, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ఇలా వివిధ జిల్లాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. మరి, నేను క్రెడాయ్ తెలంగాణకు ఎందుకు వచ్చానో మీకు చెబుతాను. హైదరాబాద్‌తో పోల్చితే తెలంగాణలోని మన జిల్లాలు, టౌన్లు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? ప్రస్తుతంతో పోల్చితే 2014 కంటే ముందే మంచిర్యాల ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్తో పోల్చితే.. కరీంనగర్, మంచిర్యాల్, జగిత్యాల, నిజామాబాద్, వరంగల్ వంటి పట్టణాలు అనుకున్నంత స్థాయిలో ఎందుకు డెవలప్ అవ్వలేదు?
పట్టణాల్ని పట్టించుకోవాలి
కేవలం వ్యవసాయమే కాదు.. యాభై శాతం కంటే ఎక్కువ ప్రజలు పట్టణాల్లోనే నివసిస్తున్నారు. ఇక్కడ అర్బన్ ఏరియాలంటే.. మన టౌన్లు, మండల్ హెడ్ క్వార్టర్లు వంటివి పట్టణ ప్రాంతాల పరిధిలోకి వస్తాయి. పట్టణాభివృద్ధి సంస్థలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సంఖ్య పెరగడం.. ప్రభుత్వం తెస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్ వంటి ఆవిష్కరణల వల్ల.. 2030 నాటికల్లా పట్టణాల్లో అరవై ఐదు శాతం దాకా నివసిస్తారు. మరి, మన పట్టణాల్లో ఎక్కడెక్కడ ఫిజికల్ ఇన్‌ఫ్రా లేదు.. సివిక్ ఇన్‌ఫ్రా లేదు.. ఏయే అంశాల మీద ప్రాపర్ ఫోకస్ లేదనే విషయాల్ని గమనించాలి.
ప్రభుత్వం పట్టణాల్ని అభివృద్ధి చేయడానికి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, మంచినీటి సరఫరా, ఉద్యోగాల కల్పన, రిక్రియేషన్ సెంటర్లు వంటివి అభివృద్ధి చేయాలి. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా డెవలప్ చేయాలనే ఆలోచనలతో పాటు తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అంశంపై మన అన్ని ఛాప్టర్లు కలిసికట్టుగా ప్రణాళికాబద్ధంగా పని చేయాలి. ఇదేదో రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు. మనమంతా వ్యూహాత్మకంగా పని చేయడానికి ప్రయత్నిస్తే.. వంద శాతం సక్సెస్ కాకపోయినా.. కొంతలో కొంత అయినా విజయం సాధించొచ్చనే నమ్మకముంది.
స్ట్రాంగ్ సెక్రటేరియట్ కావాలి
ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలిచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదంటే.. క్రెడాయ్ తెలంగాణకు బలమైన సెక్రటేరియట్ లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. మనం నిపుణులైన స్టాఫ్‌ను ఏర్పాటు చేస్తే.. మనక్కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తారు.. టెక్నికల్‌గా ఆ సమాచారాన్ని ఒక పద్ధతిలో క్రోడీకరిస్తారు.. అఫీషియల్స్‌ను క్రమం తప్పకుండా సంప్రదిస్తారు.. కాబట్టి, ఇక నుంచి నిపుణులైన సిబ్బందితో కలిసి ఒక బలమైన సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని ఛాప్టర్లను స్వయంగా కలిసి.. వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని.. వాటిని పరిష్కరించే దిశగా ప్రణాళికల్ని రచించాలని అనుకుంటున్నాం.
టెక్నికల్, లీగల్, రెవెన్యూ అంశాలకు సంబంధించి సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ల సేవల్ని వినియోగించాలని ప్లాన్ చేస్తున్నాం. విలువ ఆధారిత సేవల్ని ప్రవేశపెట్టినప్పుడే క్రెడాయ్ తెలంగాణ సభ్యులకు ప్రయోజనం కలుగుతుంది. అప్పుడే, మరిన్ని కొత్త ఛాప్టర్లను ఏర్పాటు చేయవచ్చు. క్రెడాయ్ తెలంగాణ మరింత వైబ్రెంట్ అవుతుంది. మన ఛాప్టర్లకు పెద్దన్న తరహాలో మనం ఆపన్నహస్తం అందించాల్సిన అవసరముంది. దీనిపై వందకు వంద శాతం పని చేసేందుకు ప్రయత్నిద్దాం. ఇందుకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా అడుగులేద్దాం.