General
ఇంటి స్థలాలకు బ్యాంకు రుణాలు

రియల్ ఎస్టేట్ తో బ్యాంకులది విడదీయలేని బంధం. ఇళ్లు కొనాలంటే ఎవరైనా బ్యాంకు రుణం తీసుకోవాల్సిందే. ఐతే నిన్నటివరకు గృహాలకు మాత్రమే లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇప్పుడు ఇంటి స్థలాలకు సైతం రుణాలిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ఇల్లు కట్టుకోలానుకుంటున్న వారు బ్యాంక్ లోన్ తో ఇంటి స్థలాలను కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం తో పాటు చిన్న చిన్న పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా ఇంటి స్థలాల లేఅవుట్లు వేలల్లో వెలుస్తున్నాయి. హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డు నుంచి మొదలు ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు పెద్ద ఎత్తున వెంచర్లు వస్తున్నాయి. అందులోను మొదటి దశ రీజినల్ రంగ్ రోడ్డు వచ్చే ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సందడి ఎక్కువగా కన్పిస్తోంది. చాలా మంది భవిష్యత్తు అవసరాల కోసం ఇక్కడ స్థలాలు కొనుగోలు చేస్తున్నారు.
హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన వెంచర్లలో స్థలం కొనుగోలు చేయాలంటే ప్రాంతాన్ని బట్టి కనీసంగా 5 లక్షల నుంచి మొదలవుతోంది. ఇక అభివృద్ది చేందిన ప్రాంతాల్లో ప్లాట్ కొనాలంటే మాత్రం లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. మాదాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, గచ్చిబౌళి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇంటి స్థలం కొనాలంటే గజానికి కనిష్టంగా లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు పెట్టాల్సిందే. అదే మరి కాస్త శివారు ప్రాంతాలైన ఉప్పల్, నాగోల్, హయత్ నగర్, సాగర్ రింగ్ రోడ్డు, పచాన్ చెరు, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో ఐతే గజం ధర 40 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంది. దీంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కు కాస్త దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు సమీపంలోకుని ప్రాంతాల్లో ఇంటి స్థలాలను కొంటున్నారు మధ్య తరగతివాళ్లు. కొత్తూరు, షాద్ నగర్, పెద్ద అంబర్ పేట్, బాచారం, బోరంపేట్ వంటి ప్రాంతాల్లో చదరపు గజం ప్రాంతం, ప్రాజెక్టును బట్టి 20 వేల రూపాయల నుంచి మొదలవుతోంది. గరిష్టంగా చదరపు గజానికి లేఅవుట్ ను, అనుమతులు, మౌళిక వసతులను బట్టి 50 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. అంటే శివారు ప్రాంతాల్లో 10 లక్షల నుంచి ఇంటి స్థలం లభిస్తోంది. అంటే లక్షల్లో వెచ్చిస్తే తప్ప కోరుకున్న చోట కాస్త ఎక్కువ విస్తీర్ణంలో స్థలం దొరకని పరిస్థితి.
ప్రస్తుతం చాలా మంది బ్యాంకు రుణాలు తీసుకుని ఇంటి స్థలాన్ని కొంటున్నారు. ఇల్లు కట్టుకునేందుకు, కట్టిన ఇల్లు కొనేందుకు గృహరుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకులు, ఇప్పుడు ఇంటి స్థలాలు కొనేందుకు సైతం రుణాలిస్తున్నాయి. ప్లాటు రిజిస్టర్ విలువపై 50 శాతం వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి ఉన్న లేఅవుట్లలో ప్లాటు కొంటే బ్యాంకులు సులభంగా లోన్స్ ఇస్తున్నాయి. సిబిల్ స్కోర్ ను, కస్టమర్ల రుణ చరిత్రను బట్టి ఎస్‌బీఐ ఓపెన్ ప్లాట్లకు 9 నుంచి 9.45 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. మరి కొన్ని బ్యాంకులు 9 శాతం నుంచి 13 శాతం వరకూ వడ్డీ తీసుకుంటున్నాయి. గృహరుణం కంటే ఇంటి స్థలానికి తీసుకునే రుణానికి వడ్డీ కాస్త ఎక్కువే అయినా చాలా మంది రుణాలుతీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువ మంది రుణం తీసుకునే కొంటుండటంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు సైతం బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో ఇంటి స్థలాలకు సులువుగా రుణాలు మంజూరవుతున్నాయి. ఇంటి స్థలాలకు బ్యాంకులు 5 నుంచి 20 ఏళ్ల కాలవ్యవధికి రుణాలను మంజూరు చేస్తున్నాయి. కొనుగోలు చేసిన స్థలంలో భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటే ప్లాట్ రుణాన్ని గృహ రుణంగా మార్చుకోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు.
ఇంటి స్థలం కొనుగోలు తరువాత దానిపై తీసుకున్న బ్యాంకు రుణాన్ని ఇంటి నిర్మాణ సమయంలో గృహ రుణంగా మార్చుకుంటే వడ్డీ రేటు తగ్గుతుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇంటి కోసం లోన్ తీసుకుని ఉంటే, ఇంటి స్థలం కోసం టాపప్ లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు. దీంతో చాలా మంది బ్యాంక్ రుణాలతో ఓపెన్ ప్లాట్స్ కొనేందుకు ఆసక్తిచూపుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎనిమిది జాతీయ, రాష్ట్ర రహదారులు వెంట సిటీ నుంచి 50 కిలో మీటర్ల వరకు వందలాది ఓపెన్ ప్లాట్ వెంచర్లు వస్తున్నాయి. పటాన్ చెరు నుంచి సంగారెడ్డి వరకు లేఅవుట్లలో స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ధరలు చదరపు గజం ఇరవై ఐదు వేలకు అటూ ఇటూగా ఉంది. శంకర్‌పల్లి, చేవెళ్ల మార్గాల్లో రియల్ ఎస్టేట్ విస్తరించగా, ఇక్కడ గజం 30 వేల నుంచి మొదలవుతోంది. బెంగళూరు జాతీయ రహదారిలో జడ్చర్ల వరకు చాలా రియల్ వెంచర్లు వెలవగా, రీజినల్ రింగ్ రోడ్డుకు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో 15వేల లోపు కూడా డీటీసీపీ, ఫాంల్యాండ్ ప్లాట్లను విక్రయిస్తున్నారు. శ్రీశైలం జాతీయ రహదారిలో ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల చదరపు గజం 25 వేల రూపాయల నుంచి ఓపెన్ ప్లాట్లు దొరుకుతున్నాయి.