General

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ కు మరో కీలక అడుగు

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ కు మరో కీలక అడుగు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు వేసింది. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లతో పరిపాలనా పరమైన అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ మునిసిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టు ద్వారా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రెండవ దశ మెట్రో దశ ప్రాజెక్టులో మొత్తం 86.1 కిలో మీటర్ల మేర మూడు కొత్త కారిడార్లను నిర్మించనున్నారు. కారిడార్ 1 లో శంషాబాద్ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు 39.6 కిలో మీటర్లు, కారిడార్ 2లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలో మీటర్లు, కారిడార్ 3 లో జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలో మీటర్లు.. ఇలా మొత్తం మూడు కారిడార్లలో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ మెట్రో రెండవ దశ ప్రాజెక్టును హైదరాబాద్ ఎయిర్‌ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త వెంచర్‌ గా చేపట్టనున్నాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 30 శాతం కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతంగా ఉండనుందని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎజెన్సీ- జైకా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్-ఏడీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు-ఎన్డీబీ నుండి 48 శాతం రుణం తీసుకోనున్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కాంపోనెంట్ 4 శాతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. వచ్చే నెల మెట్రో రెండవ దశ ప్రాజెక్టుకు సంబందించిన పరిపాలనా అనుమతిని డీపీఆర్‌కు జత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇది మెట్రో ప్రాజెక్టు అమలులో కీలకమైన ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.125 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాతబస్తీ మెట్రోకు 2025-26 బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించగా.. అందులో నుంచి మొదటి విడతగా ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులు పాతబస్తీలో మెట్రో మార్గం పనులను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని అధికారులు చెప్పారు. చాలా కాలంగా మెట్రో కోసం ఎదురుచూస్తున్న పాతబస్తీ ప్రాంత ప్రజల కల సాకారం కానుంది. మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టుతో పాటు పాతబస్తీ మెట్రో విస్తరణతో హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాకుండా, నగర అభివృద్ధికి కూడా దోహదపడనున్నాయి. దీంతో నగర శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగవ్వనుండటంతో సొంతింటిని ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నారు.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available