General

అఫర్డబుల్ రుణాలూ అదరహో

అఫర్డబుల్ రుణాలూ అదరహో
  • మూడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేరనున్న అందుబాటు ధరల ఇళ్ల రుణాలు
  • ఇక్రా నివేదిక వెల్లడి
దేశంలో అందుబాటు ధరల ఇళ్ల రుణాలు అదరహో అనిపించనున్నాయి. వచ్చే మూడేళ్లలో అఫర్డబుల్ హౌసింగ్ రుణాలు గణనీయంగా పెరగనున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ప్రస్తుతం అఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నిర్వహణలోని రుణాలు రూ.1.4 లక్షల కోట్లుగా ఉండగా.. మూడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటాయని పేర్కొంది. అలాగే నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల మార్ట్ గేజ్‌ రుణాలు 2025 మార్చి నాటికి రూ.13 లక్షల కోట్లుగా ఉండగా.. 2028 మార్చి నాటికి రూ.20 లక్షల కోట్లకు పెరుగుతాయని తెలిపింది. సంప్రదాయంగా మార్ట్ గేజ్‌ రుణ విభాగం బలమైన పనితీరు చూపిస్తోందని.. నష్టాలు తక్కువగా ఉండడంతోపాటు రాబడులు కూడా మెరుగ్గా ఉంటున్నాయని వివరించింది. మొత్తం మార్ట్ గేజ్‌ రుణాల్లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) మూడింట రెండొంతుల వాటా కలిగి ఉన్నాయని వెల్లడించింది. మొత్తం మార్ట్ గేజ్‌ రుణాల్లో అఫర్డబుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఏహెచ్‌ఎఫ్‌సీ) వాటా 11 శాతంగా ఉంది. స్వయం ఉపాధిలోని రుణ గ్రహీతలు తీసుకునే గృహ రుణాల్లో హెచ్‌ఎఫ్‌సీలతో పోల్చి చూస్తే ఏహెచ్‌ఎఫ్‌సీలు అధిక వాటా కలిగి ఉన్నట్టు ఇక్రా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ మొత్తం రుణాల్లో ఏహెచ్‌ఎఫ్‌సీలకు అధిక వాటా ఉందని.. ఇటీవలి కాలంలో వీటి ఏయూఎం వేగంగా పెరిగినట్టు తెలిపింది. వసూలు కాని మొండి రుణాలు (ఎన్‌పీఏలు) ఏహెచ్‌ఎఫ్‌సీల మొత్తం రుణాల్లో 1.1 నుంచి 1.3 శాతంగానే ఉండటం ఊరటనిచ్చే అంశమని విశ్లేషించింది.