తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి
* సెంట్రింగ్ రేట్ల నిర్ణయం
సంఘాల పరిధిలో లేదు
* కాంట్రాక్టర్, బిల్డర్ మధ్య
కుదిరే ఒప్పందం ఇది..!
* హఠాత్తుగా ట్రాన్స్‌ఫార్మర్ల కొరత
* పరిష్కరించకపోతే బయ్యర్లకూ ఇబ్బందే
* నత్తనడకన నాలా క్లియరెన్స్..
* ఐదు శాతం మార్టిగేజ్ విడుదల ఆలస్యం
* వైఎస్సార్ తరహాలో మహిళలకు రాయితీనివ్వాలి
సెంట్రింగ్ పనులకు సంబంధించిన రేట్లను నిర్ణయించడం నిర్మాణ సంఘాల పరిధిలో ఉండదని తెలంగాణ బిల్డర్స్ ఫోరం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణలోని వివిధ నిర్మాణ సంఘాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇటీవల బంజారాహిల్స్‌లో జరిగిన సర్భసభ్య సమావేశంలో సంఘ ప్రతినిధులు కూలంకషంగా చర్చించారు. సెంట్రింగ్ రేట్లు అనేవి కాంట్రాక్టర్ మరియు బిల్డర్ మధ్య పరస్పర అవగాహనతో నిర్ణయం తీసుకుంటారని.. ప్రాజెక్టు స్థలం, దాన్ని విస్తీర్ణం, సాంకేతిక అవసరాలు, స్పెసిఫికేషన్లు, పనుల స్వభావాన్ని బట్టి ధరలు మారుతాయని అభిప్రాయపడింది. కాబట్టి, సంఘం తరఫున రేట్లను నిర్ణయించి.. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాలనే నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదని తెలియజేసింది. కాకపోతే, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన హెల్త్ కార్డులు, బీమా సదుపాయం, ప్రమాదాల సమయంలో పరిహారం వంటి అంశాలపై ప్రయోజనాలు అందే విషయంపై ప్రభుత్వంతో పాటు కార్మిక శాఖకు వినతి పత్రాన్ని అందించాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యను పరిష్కరించాలి
విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల కొరత కారణంగా నిర్మాణ సంస్థలతో పాటు గృహకొనుగోలుదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని టీబీఎఫ్ చర్చించింది. గతంలో బిల్డర్లు ఆధీకృత ఏజెన్సీలు లేదా సరఫరాదారుల ద్వారా ట్రాన్స్‌ఫార్మర్లను కొనేసి ప్రాజెక్టుల్లో ఏర్పాటు చేసుకునేవారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందాకే సంబంధిత విద్యుత్ శాఖ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్లు పొందాలనే ప్రభుత్వ విధానం వల్ల బిల్డర్లతో పాటు కొనుగోలుదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీబీఎఫ్ విచారం వ్యక్తం చేసింది. నిర్మాణం పూర్తయ్యాక బయ్యర్లకు ఫ్లాట్లను అప్పగించాక కూడా.. ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో లేకపోవడం వల్ల సాధారణ విద్యుత్తు ఛార్జీలకు బదులు వాణిజ్య ఛార్జీలను కట్టాల్సి వస్తోందని తెలియజేసింది. విద్యుత్తు శాఖ వద్ద స్టాక్ కొరత కారణంగా మూడు నెలల్నుంచి తొమ్మిది నెలల దాకా ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా లేని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాబట్టి, పాత విధానాన్ని అమలు చేయాలి లేదా భవనం పూర్తి కాకముందే ట్రాన్స్‌ఫార్మర్లు కొనేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని టీబీఎఫ్ ముక్తకంఠంతో కోరింది.
నత్తనడకన నాలా క్లియరెన్స్
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక కొన్ని భూములకు సంబంధించిన నాలా క్లియరెన్స్ వివరాలు రెవెన్యూ శాఖ వద్ద అందుబాటులో లేకపోవడం వల్ల బిల్డర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు బిల్డింగ్ పర్మిషన్లు మంజూరు చేసేటప్పుడు.. నిర్థారిత ఫీజుల్ని చెల్లించాకే నాలా క్లియరెన్స్ పొందాలనే నియమం అమల్లో ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి పోర్టల్ సదుపాయం అందుబాటులో లేదు. ఫలితంగా, నాలా క్లియరెన్సుల్లో ఆలస్యం జరుగుతోందని సంఘం తెలియజేసింది.
ఫలితంగా భవనాలు పూర్తయ్యి.. నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగినప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను పొందడంలో ఆలస్యమవుతుంది. నాలా క్లియరెన్స్ పెండింగ్‌లో ఉండటం వల్ల.. ఐదు శాతం మార్టిగేజ్ విడుదల కాకపోవడం వల్ల బిల్డర్లు ఆ భాగాన్ని అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని సంఘం తెలిపింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ ద్వారా సంబంధిత రుసుముల్ని వసూలు చేసి.. ఆయా శాఖకు సొమ్మును చెల్లించే విధానాన్ని అమలు చేయాలని టీబీఎఫ్ కోరింది.
వైఎస్సార్ ఇచ్చినట్టే రాయితీని..
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న అందుబాటు గృహాల నిర్మాణాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరియు మార్కెట్ విలువల నిర్ణయంలో సమతుల్యత పాటించాలని సమావేశం సూచించింది. మహిళల పేరిట ఆస్తి కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలపై సుమారు 3 నుంచి 5 శాతం రాయితీని అందజేయాలని కోరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్సార్ అమలు చేసినట్లే.. మహిళలకు రాయితీలను ప్రవేశపెట్టాలని ముక్తకంఠంతో ప్రభుత్వానికి టీబీఎఫ్ విజ్ఞప్తి చేసింది.
