- హైదరాబాద్ రియాల్టీ సరికొత్త రికార్డు
- కార్పొరేట్ బిల్డర్లతో రేట్ల పెరుగుదల
- సాధారణ మార్కెట్‌కు ఇది వర్తించదు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తా ఎంటో మరోసారి రుజువైంది. నగరంలో ఎకరా భూమికి రికార్డు స్థాయిలో 177 కోట్ల ధర పలకడం ఔరా అనిపిస్తోంది. ఐటీ కారిడార్ లోని రాయదుర్గం భూములను టీజీఐఐసి ఈ వేలం వేయగా కనీవినీ ఎరుగని రీతిలో ఎకరం 177 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తం 18.67 ఎకరాలను వేలయం వేయగా తెలంగాణ ప్రభుత్వానికి 3,135 కోట్ల ఆదాయం వచ్చింది. మూడేళ్ల క్రితం కోకాపేట్ నియోపోలిస్ లో ఎకరం 100 కోట్ల ధర పలకడం, ఇప్పుడు రాయదుర్గంలో అది 177 కోట్లకు పెరగడంతో హైదరాబాద్ లో భూముల ధర 75 శాతం పెరిగిందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కు కేంద్ర బిందువైన రాయదుర్గంలో ప్రభుత్వ భూమికి కనీవినీ ఎరుగని ధర వచ్చింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన వేలంలో రికార్డుస్థాయిలో ఎకరాకు 177 కోట్ల ధర పలికింది. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న రాయదుర్గంలోని 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ వేలం వేయగా ఇంతకు ముందెన్నడూలేని ధరకు అమ్ముడుపోయిుంది. ఇందులో సర్వే నంబరు 83/1లో ప్లాట్ నంబరు 19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబరులో ప్లాట్ నంబరు 15ఎ2లో 7.67 ఎకరాల భూములున్నాయి. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరనే 101 కోట్లుగా నిర్ణయించింది టీజీఐఐసి. ఈ-వేలం విధానంలో 7.67 ఎకరాల భూమి వేలంలో ఒక్కో ఎకరాకు 177 కోట్లు చొప్పున ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ కొనుగోలు చేసింది. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 1,357.59 కోట్ల ఆదాయం లభించింది. ఇక ఇక్కడే మరో 11 ఎకరాలకు జరిగిన ఈ-వేలంలో ఎకరాకు 141.5 కోట్ల ధర పలికింది. ఈ 11 ఎకరాలను ప్రెస్టేజ్ రియారిటీ సంస్థ దక్కించుకుంది.
రాయదుర్గం భూవేలం ద్వారా ప్రభుత్వానికి 1,556.5 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా రాయదుర్గంలోని 18.67 ఎకరాల వేలం ద్వారా రేవంత్ సర్కార్ కు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ లతో కలుపుకొని 3,135 కోట్ల ఆదాయం వస్తుందని టీజీఐఐసీ తెలిపింది. ఎకరాకు 177 కోట్లు అన్నది తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే రికార్డుస్థాయి ధర అని ప్రభుత్వ రంగ వర్గాలు చెబుతున్నాయి. రాయదర్గంలోని ఈ భూమి ఐటీ కారిడార్ లో ఉండటంతో పాటు.. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉండటంతో రియాల్టీ సంస్థలు పోటీపడీ మరీ కొనుగోలు చేశాయి. పక్కనే మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ, ఐటీఈఎస్, కమర్షియల్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, రిటైల్, ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ తదితర అభివృద్ధి సంస్థలకు అనుకూల ప్రాంతంగా ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఇక్కడి నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సులభంగా రాకపోకలు కొనసాగించేలా కనెక్టివిటీ మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహించిన భూ వేలంలో 2017లో రాయదుర్గంలో 2.84 ఎకరాలకు గాను ఎకరా 42.59 కోట్లు పలకింది. ఆ తరువాత 2022లో కోకాపేట నియోపోలీస్ వేలంలో 3.60 ఎకరాల వేలంలో ఎకరాకు ఏకంగా 100.75 కోట్లు గరిష్ఠ ధర పలికి అప్పట్లో రికార్డు సృష్టించింది. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రికార్డు స్థాయిలో ఎకరాకు 177 కోట్ల ధర పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2022 నియోపోలీస్ భూముల వేలంతో పోలిస్తే ఈ మూడేళ్లలో సుమారు 75 శాతం వృద్ధి సాధించినట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. రాయదుర్గంలో జరిగిన ఈ భూముల వేలంలో రికార్డుస్థాయిలో ఎకరాకు 177 కోట్ల ధర పలకడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తా ఎంటో మరోసారి రుజువైందనే టాక్ వినిపిస్తోంది.
ఇక కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ లో నివాస భూములకు సైతం రికార్డు స్థాయి ధరలు పలికాయి. తెలంగాణ హౌజింగ్ బోర్డ్ నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం ఏకంగా రూ.1.14 లక్షలు పలికింది. మొత్తం 513 చదరపు గజాల విస్తీర్ణంలోని హెచ్ఐజీ ఓపెన్ ప్లాట్‌కు ఆఫ్సెట్ ప్రైస్ చదరపు గజానికి రూ.80 వేలు నిర్ణయించగా.. రూ.1.14 లక్షలకు కొనుగోలు చేశారు. హెచ్‌ఐజీలోనే మరో ప్లాట్‌ను చదరపు గజానికి రూ.లక్ష చొప్పున కొన్నారు. మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్లకు బహిరంగ వేలం వేయగా హౌసింగ్ బోర్డుకు రూ.44.24 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ భూ వేలంలో మొత్తం 27 మంది బిడ్డర్లు పాల్గొనగా.. ఇక్కడ చదరపు గజానికి సగటున రూ.91,947 ధర పలికింది.
