General

2050 నాటికి ప్రపంచంలో మూడింట రెండొంతుల మంది పట్టణాల్లోనే నివాసం

2050 నాటికి ప్రపంచంలో మూడింట రెండొంతుల మంది పట్టణాల్లోనే నివాసం
  • రోజుకు 48 వేల ఇళ్లు కావాలి
  • ఫలితంగా ఇళ్లకు భారీ డిమాండ్
  • భారత్ లో అవసరాలు తీరాలంటే రోజుకు 10,200 కొత్త ఇళ్లు కావాలి
 
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది (దాదాపు 640 కోట్ల మంది) పట్టణాల్లోనే నివసిస్తారు. అంటే దాదాపు 245 కోట్ల మంది అదనంగా పట్టణాలకు తరలి వెళతారన్నమాట. 
 
1980లో పట్టణాల్లో నివసించేవారు 39 శాతం ఉండగా.. ఇటీవల కాలంలో ఇది గణనీయంగా పెరిగింది. దీంతో 2050 నాటికి పట్టణాల్లో గృహాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రతిరోజూ దాదాపు 48వేల కొత్త ఇళ్లు కావాల్సి వస్తుంది. వాస్తవానికి ఇళ్ల సరఫరాలో పురోగతి ఉన్నప్పటికీ, పట్టణీకరణ గృహ లభ్యత కంటే వేగంగా ముందుకెళ్తోంది. 2020లో 1.1 బిలియన్ల మంది ప్రజలు మురికివాడలు లేదా అలాంటి ప్రాంతాల్లో నివసించగా.. వారిలో 80% మంది ఆసియా, ఆఫ్రికాలోనే ఉన్నారు. మురికివాడల నివాసితుల నిష్పత్తి 2014లో 25.4% ఉండగా.. 2020 నాటికి 24.2 శాతానికి స్వల్పంగా తగ్గింది. నిరంతర వలసల వల్ల ఈ సంఖ్యలు పెరుగుతూనే ఉన్నాయి. 
 
ఇక మనదేశం విషయానికి వస్తే.. ప్రపంచంలో అత్యధిక జనాభా సాంద్రత కలిగిన దేశాలలో భారత్ ఒకటి. చదరపు కిలోమీటరుకు 492 మంది నివసిస్తున్నారు. దేశంలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాలు 46 మాత్రమే ఉన్నాయి. చైనాలో ఇది 105గా ఉంది. 2020లో 48 కోట్లుగా భారతదేశ పట్టణ జనాభా 2050 నాటికి 95 కోట్లకు పెరగునుందని అంచనా. ఈ డిమాండ్‌ను తీర్చడానికి ప్రతిరోజూ 10,200 కొత్త గృహ యూనిట్లు అవసరం అవుతాయి. గోవా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి దక్షిణాది రాష్ట్రాలు పట్టణీకరణలో ముందంజలో ఉండగా, అనేక ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. వాస్తవానికి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం భారతదేశ పట్టణ వృద్ధికి చాలా కీలకం.
ఇప్పటికే భారతదేశ జీడీపీకి ఇవి రెండూ కలిసి 14.7 శాతం మేర తోడ్పాటును అందిస్తున్నాయి. ఇక మన దేశంలో 64 శాతం మంది ఇళ్ల కొనుగోలుదారులు స్వీయ వినియోగం కోసమే ఇళ్లు కొంటారు. అయితే, అందుబాటు ధరల ఇళ్ల లభ్యతలో సరైన విధానం లేకపోవడం వల్ల అందరికీ గృహ సదుపాయం అనేది ముఖ్యమైన సమస్యగానే ఉంటోంది. ప్రపంచ బ్యాంకు డేటా (2019) ప్రకారం, దాదాపు 6.3 కోట్ల మంది భారతీయులు (మనదేశ జనాభాలో 5% మంది) ఇప్పటికీ మురికివాడల్లో నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అందువల్ల అందుబాటు ధరల ఇళ్లు అనేవి సామాజిక అవసరం మాత్రమే కాదు.. విధానపరమైన ఆవశ్యకత కూడా. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ 2020 మిషన్ కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ పథకం 3 కోట్లకు పైగా ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో దాదాపు 2.6 కోట్లు పూర్తయ్యాయి. ఇక భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ అనేది గ్రోత్ ఇంజిన్ గా ఉండబోతోంది. 
 
2047 నాటికి భారతదేశం నిర్మాణ, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సులభతరం చేయడంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండే దిశగా ముందుకెళ్తోంది. ఈ పరిణామం పారదర్శకత, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడమే కాకుండా భారతదేశ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభంగా రియల్ ఎస్టేట్‌ను స్థిరపరుస్తుంది. ఇది మిలియన్ల కొద్దీ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది, 250 అనుబంధ పరిశ్రమలకు శక్తినిస్తుంది. తద్వారా గృహనిర్మాణం అనేది కేవలం ప్రాథమిక అవసరంగా కాకుండా భారతదేశ భవిష్యత్తు వృద్ధికి పునాదిగా చేస్తుంది. ‘భారతదేశ పట్టణీకరణ ఒక సవాల్. ఒక అవకాశం. 2050 నాటికి దాదాపు 95 కోట్ల మంది నగరాల్లో నివసించే అవకాశం ఉన్నందున, గృహాలకు డిమాండ్ అపూర్వంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం ఈ అవసరాన్ని తీర్చడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే సరసమైన, సమ్మిళిత గృహాలు ఈ వృద్ధికి కేంద్రంగా ఉండాలి’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ పేర్కొన్నారు.