General

కొంపల్లిలో ‘బ్రిగేడ్ గ్రూప్’ భారీ ప్రాజెక్ట్‌

కొంపల్లిలో ‘బ్రిగేడ్ గ్రూప్’ భారీ ప్రాజెక్ట్‌

బెంగళూరుకు చెందిన ప్రముఖ లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ 'బ్రిగేడ్ గ్రూప్', హైదరాబాద్‌లోని కొంపల్లి ప్రాంతంలో 5.6 ఎకరాల స్థలంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (జీడీఏ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.850 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.

ఉత్తర హైదరాబాద్‌లో ఆధునిక, పర్యావరణ అనుకూల జీవన ప్రమాణాలతో కూడిన గృహాల కోసం చూస్తున్న కొనుగోలుదారుల అవసరాలను ఈ ప్రాజెక్ట్ తీర్చనుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ మైసూర్ మాట్లాడుతూ.. "బ్రిగేడ్ గ్రూప్‌కు హైదరాబాద్ అత్యంత కీలకమైన మార్కెట్. ఇక్కడ వరుస ప్రాజెక్ట్‌లను చేపట్టడమే ఇందుకు నిదర్శనం. ఐటీ, మౌలిక సదుపాయాల రంగాల ఊతంతో నగరం సాధిస్తున్న బలమైన ఆర్థిక వృద్ధి, వ్యాపార విస్తరణకు ఎంతో అనుకూలమైనది" అని పేర్కొన్నారు. అలాగే, వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్న స్థలాలను ఎంచుకుంటూ, నైతిక విలువలు, నిబంధనలకు కట్టుబడి తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. కాగా, వచ్చే మూడు నాలుగేళ్లలో హైదరాబాద్‌లో సుమారు రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు బ్రిగేడ్ గ్రూప్ ప్రకటించింది. ఈ నిధులను రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటాలిటీ (హోటళ్లు), మరియు రిటైల్ రంగాల్లో విస్తరణకు ఉపయోగించనున్నట్లు తెలిపింది.

హైదరాబాద్ మార్కెట్లో బంజారాహిల్స్‌లోని 'బ్రిగేడ్ ఎట్ నెం.7' ప్రాజెక్ట్‌తో అడుగుపెట్టిన ఈ సంస్థ, ఆ తర్వాత మోతీనగర్‌లో 'బ్రిగేడ్ సిటాడెల్', 'బ్రిగేడ్ ఎన్‌క్లేవ్', 'బ్రిగేడ్ మనోర్' ప్రాజెక్ట్‌లను చేపట్టింది. ప్రస్తుతం నియోపోలిస్‌లో 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 'బ్రిగేడ్ గేట్‌వే' పేరిట భారీ మిక్స్‌డ్-యూజ్ (కమర్షియల్ మరియు రెసిడెన్షియల్) ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇటీవలే నియోపోలిస్‌లో కొనుగోలు చేసిన మరో 4 ఎకరాల ప్రాజెక్ట్ డిజైనింగ్ దశలో ఉందని కంపెనీ పేర్కొంది. కాగా, ఏప్రిల్ 2026లో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన వేలంలో బ్రిగేడ్ గ్రూప్ 5.72 ఎకరాల భూమిని దక్కించుకుంది. రిజిస్ట్రేషన్ ఖర్చులు కాకుండా, ఎకరాకు రూ.44 కోట్ల చొప్పున ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇక్కడ ఒక ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. 1986లో ప్రారంభమైన బ్రిగేడ్ గ్రూప్.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్, కొచ్చి, తిరువనంతపురం, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలలో విస్తరించి ఉంది.